Indian Economy: నరేంద్ర మోదీ ప్రభుత్వం కరోనా సంక్షోభం నుంచి ఆర్ధిక వ్యవస్థను బయటపడేసిందా? – amaravathinews.in

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జూలై, సెప్టెంబర్ మధ్య భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 8.4 శాతం పెరిగి రూ.35,73,000 కోట్లకు చేరుకుంది. ఈ పెరుగుదల ఊహించిన దాని కన్నా ఎక్కువగా ఉంది. అంతే కాకుండా, కరోనా మహమ్మారి వ్యాప్తికి ముందున్న స్థితికి ఆర్థిక వ్యవస్థ చేరుకుంది.

2019లో ఏప్రిల్, జూన్ మధ్య జీడీపీ రూ.35,66,000 కోట్లు. అంటే ప్రస్తుత లెక్కలను బట్టి కరోనా పూర్వ పరిస్థితికి చేరుకున్నట్టే. దీని ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా సంక్షోభం నుంచి బయటపడిందని చెప్పవచ్చా? ఈ ఏడాది రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4 శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. దీనికి ముందు త్రైమాసికంలో 20.1 శాతం పెరుగుదల నమోదైంది. గత ఏడాది ఈ రెండు త్రైమాసికాల్లో ఆర్థికవ్యవస్థ కుదేలై, ఆర్థికమాంద్యంలో పడిపోయింది. కిందటి ఏడాది మొదటి త్రైమాసికంలో 24.4 శాతం, రెండవ త్రైమాసికంలో 7.4 శాతం క్షీణించింది.

రెండేళ్ల క్రితం పరిస్థితికి ఆర్థికవ్యవస్థ చేరుకుందా లేదా అన్నదే అసలు లెక్క. చేరుకుందని స్థూల గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ రెండు త్రైమాసికాల్లో నమోదైన వృద్ధి రేటు ప్రపంచంలోని పెద్ద దేశాల వృద్ధి రేటుకు సమీపంలో ఉంది. కాబట్టి, ఆర్థికవ్యవస్థ వేగం ఊహించిన దానికంటే మెరుగ్గా కనిపిస్తోందని చెప్పవచ్చు. ప్రస్తుత త్రైమాసికంలో వృద్ధి రేటు 7.9 శాతం ఉండవచ్చని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. అంటే, వృద్ధి వేగం కొనసాగుతోందని అర్థం.

అయితే, మొత్తం ఆర్థికవ్యవస్థ అభివృద్దిని అర్థం చేసుకోవడానికి ఈ లెక్కలు సరిపోవు. జీడీపీ నంబర్లు బావుంటే అంతా బాగున్నట్లు కాదు. ఇందులో ఆందోళనపరిచే కొన్ని విషయాలు దాగి ఉన్నాయి. ఆర్థికవ్యవస్థలో కనిపించే వృద్ధిలో దేశం మొత్తం సరిసమానంగా పాలు పంచుకుంటోందని చెప్పలేం. ఇదే పెద్ద ఆందోళన. జీడీపీ గణాంకాలను మరింత లోతుగా విభజించి చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగం నుంచి పెద్ద మద్దతు లభించింది. ఈ ఏడాది త్రైమాసికాల లెక్కలు కూడా ఇదే విషయాన్ని ధృవపరుస్తున్నాయి. వ్యవసాయ రంగంలో 4 శాతం వృద్ధి కనిపిస్తోంది. గత రెండేళ్లనూ కలిపి చూస్తే మొత్తంగా 7.5 శాతం పెరుగుదల కనిపిస్తోంది.

Related Articles

Latest Articles