సీసీ కెమెరా: అడుగడుగున నిఘా.. మానవ హక్కుల ఉల్లంఘనా? లేక భద్రత కోసం అనివార్యమా?

భద్రత, నేరస్తులను పట్టుకునే విషయంలో సీసీ కెమెరాల పాత్ర ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కేసుల్ని పరిష్కరించడంలో పోలీసులకు అవి చేసే సాయం అంతా ఇంతా కాదు.

భద్రత సరే. కానీ, ఆ పేరుతో మన జీవితాల్లోకి కెమెరాలు, అధికార యంత్రాంగం చొరబడుతున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం అవుననే అంటోంది అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తాజా నివేదిక. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా సంగతెలా ఉన్నా, అసలు వీటి వినియోగమే అనుమానాస్పదంగా మారిందని మానవ హక్కుల కార్యకర్తలు వాదిస్తున్నారు. అయితే, ఇది పూర్తిగా భద్రత కోసం తప్ప మరొకటి కాదని పోలీసులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో చిన్న చిన్న పట్టణాల నుంచి మహా నగరాల వరకు అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాయి ఆయా ప్రభుత్వాలు. హైదరాబాద్ వంటి మహానగరంలో అయితే అడుగడుగునా సీసీ కెమెరాల నిఘా కనిపిస్తూ ఉంటుంది. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల అనుక్షణం మనల్ని ఎవరో ఒకరు గమనిస్తూనే ఉంటారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అని అమ్నెస్టీ చెబుతోంది. వీటి నిఘా వల్ల జరిగే లాభం కన్నా నష్టమే ఎక్కువన్నది ఆ సంస్థ అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా “బ్యాన్ ది స్కాన్” అనే పేరుతో ఇటీవల నిర్వహించిన క్యాంపెయిన్‌లో భాగంగా హైదరాబాద్ నగరంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ, అలాగే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడకం చాలా ఎక్కువగా జరుగుతోందని ఆమ్నెస్టీ పేర్కొంది.

సామాన్య పౌరుడిపై అడుగడుగునా నిఘా పెట్టడం, స్కాన్ చేయడం మానవ హక్కులకు విరుద్ధం అన్నది ఆ సంస్థ మాట. “హైదరాబాద్ పూర్తి నిఘా వలయంలోకి జారుకుంటోంది. ముఖ్యంగా ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత వల్ల మనం ఎవరమన్నది పోలీసులకు తెలీకుండా అడుగు కూడా బయట పెట్టలేని పరిస్థితి నెలకొంది” అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ బిగ్ డేటా రిసెర్చర్‌గా వ్యవహరిస్తున్న మాట్ మహామౌది బీబీసీతో అన్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి భద్రత విషయంలో సీసీ కెమెరాల వినియోగంపై ప్రభుత్వం ఎక్కువగా దృష్టి సారించింది. వీటి ద్వారా సేకరించిన డేటాను భద్రపరుస్తోంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ రూం కూడా భద్రతా చర్యల్లో భాగమే. సీసీ కెమెరాల ద్వారా సేకరించిన డేటా సహా ఇతర ముఖ్యమైన వివరాలన్నింటిని ఈ సెంటర్లో అత్యంత భద్రంగా ఉంచాలన్నది ప్రభుత్వ ఆలోచన.

Related Articles

Latest Articles