అసలు ఎం జరిగింది? ప్రశాంత్ కిషోర్ ఎందుకు కాంగ్రెస్ కు ఎందుకు షాక్ ఇచాడు? ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూదం.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్నికల వ్యూహకర్త, ఐ ప్యాక్ కంపెనీ అధిపతి ప్రశాంత్ కిషోర్ (పీకే) వరుస సమావేశాలు కావడం, 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం ఏం చేయాలో చెప్పే వివరణాత్మక నివేదిక, ప్రజంటేషన్ ఇవ్వడం చూశాం.
దాంతో ఇంకేముంది.. పీకే కాంగ్రెస్ లో చేరి కీలక బాధ్యతలు చేపట్టడం ఖాయమన్న ఊహాగానాలు వచ్చాయి. చివరికి ఇది బెడిసికొట్టింది. ఎన్నికల గెలుపునకు, పార్టీ సంస్కరణకు సోనియా ‘ఎంపవర్డ్ యాక్షన్ గ్రూపు’ పేరుతో ఒక కమిటీ వేయగా, అందులో చేరాలని సోనియా కోరడంతో పీకే నిరాకరించారట. ఇక్కడ ప్రధానంగా కొన్ని అంశాల విషయంలో వీరికి సంధి కుదరలేదని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఎవరికి ఇవ్వాలి? ఏ విధానం అనుసరించాలో తాను డిసైడ్ చేయాలన్నది పీకే అభిలాష. పూర్తి స్వేచ్ఛతో ఈ బాధ్యతలు కట్టబెట్టాలని ఆయన కోరుకున్నారు. అంటే పార్టీలో కీలక పాత్రకు ఆయన గురిపెట్టారు. మొత్తం సమాచార సంబంధాలు, టికెట్ల వ్యవహారాలు పీకేకి ఇస్తే పార్టీలో ఇతరులకు పని లేకుండా చేసినట్టు అవుతుంది. అప్పుడు పీసీసీలు, సీఈసీ ఏం చేయాలి? ఇది కాంగ్రెస్ కు నచ్చలేదు.
అలాగే, ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్నది పీకే సూచన. కేసీఆర్, జగన్, మమత తదితరులతో పొత్తు చర్చలు నిర్వహించాలని, అప్పుడే మోదీని ఓడించగలమని పీకే నమ్ముతున్నారు. ఇలా చేస్తే పార్టీ క్షేత్రస్థాయిలో కోలుకోకుండా అయిపోతుందన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లో ఉంది. పైగా కేసీఆర్, మమత, జగన్ వంటి ప్రత్యర్థి పార్టీలతో పొత్తు వ్యవహారాలు మంచివి కావన్న అభిప్రాయాన్ని దిగ్విజయ్ సింగ్ సహా కొందరు సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
2024 లోక్ సభ ఎన్నికలపైనే పీకే గురి పెట్టారు. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఏడాది చివర, వచ్చే ఏడాది జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేయాలని పీకేను కోరుతోంది. ప్రియాంకాగాంధీని పార్టీ చీఫ్ గా చేయాలన్నది పీకే అభిమతంగా తెలుస్తోంది. ఆమెను అధ్యక్షురాలిని చేసి, కీలక బాధ్యతలు తాను తీసుకుంటే వెనుక నుంచి చక్రం తిప్పొచ్చన్నది పీకే వ్యూహంగా ఉందని అంటున్నారు.