ఏపీలో అమరావతి విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఇక్కడి కమ్మ సామాజిక వర్గంలో అసంతృప్తి ఉండనే ఉంది. అయితే తెలంగాణలో ఉన్న కమ్మ సామాజికవర్గ నేతల్లోనూ దీనిపై తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు తాజాగా బయటపడింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కమ్మ సామాజికవర్గ సమ్మేళనంలో అమరావతి, సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
నిజమాబాద్ లో నిర్వహించి కమ్మ సమ్మేళనంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకాచౌదరి సహా పలువురు కుల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో కమ్మ సామాజిక వర్గాన్ని అణగదొక్కేందుకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రేణుక సహా పలువురు నేతలు తప్పుబట్టారు. ఏపీలో కమ్మ సామాజిక వర్గాన్ని అణచివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన రేణుకా చౌదరి.. అమరావతి కేంద్రంగా ఈ ప్రయత్నాలు జరగడంపై మండిపడ్డారు.
అమరావతిని కమ్మరావతిగా హేళన చేస్తున్న ఏపీ సీఎం జగన్.. చేతనైతే రాజధానికి కమ్మరావతిగా పేరు పెట్టాలని సవాల్ విసిరారు. అప్పుడు ఏం జరుగుతుందో చూడాలన్నారు. అమరావతి కమ్మ రాజధానిగా పేర్కొంటూ జగన్ తో పాటు వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని రేణుక తీవ్రంగా తప్పుబట్టారు. మమ్మల్ని తక్కువగా అంచనా వేయకండి అంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్మ సామాజికవర్గం మంచితనాన్ని బలహీనతగా చూడకండని సీఎం జగన్ కు రేణుక చురకలు అంటించారు. రాష్ట్రం నిలబడాలంటే అన్ని కులాలు అవసరమేనన్నారు.