చర్లపల్లి జైలుకు రేవంత్ రెడ్డి.. 14 రోజుల రిమాండ్..

0
58
Revanth Reddy arrested, Telangana MP arrested for illegal use of Drone, Telangana Congress President Revanth Reddy arrested, Telangana Pradesh Congress Committee, TPCC, Chevella MP, Konda Vishweshwar Reddy, KTR Farmhouse

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఉప్పర్‌పల్లి న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో పోలీసులు ఆయణ్ని జైలుకు తరలించారు. రెండు రోజుల కిందట రంగారెడ్డి జిల్లా జన్వాడలో అనుమతి లేకుండా డ్రోన్‌ ఎగురవేశారనే కేసులో రేవంత్‌ రెడ్డితో పాటు ఆయన సోదరుడు, మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రేవంత్‌ రెడ్డి గురువారం (మార్చి 5) మధ్యాహ్నం నార్సింగ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

అరెస్ట్ కు సంబంధించిన పత్రాలను పరిశీలించిన జడ్జీ, రేవంత్ రెడ్డికి 14 రోజులపాటు రిమాండ్ విధించింది. కాగా, రేవంత్ రెడ్డిని రాజేంద్ర నగర్ నుంచి చర్లపల్లి జైలుకు తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని అంశాలను పూర్తి చేసి రేవంత్ రెడ్డిని చర్లపల్లి తరలించబోతున్నారు. రేవంత్ రెడ్డితో పాటుగా అయన సోదరుడు, మరికొంతమందిని కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

కేటీఆర్ ఫామ్‌హౌస్ ఎక్కడ? ఏంటా వివాదం?

గండిపేట చెరువుకు వెళ్లే దారిలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్‌ హౌస్‌ నిర్మించారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో పాటు పలువురు అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సోమవారం (మార్చి 2) మధ్యాహ్నం ఫామ్ హౌస్ ముట్టడికి యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు, మార్గమధ్యలో జన్వాడ వద్ద నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీ‍ఆర్‌ చట్టాలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. 111 జీవోను అతిక్రమించి మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫామ్ హౌస్ నిర్మించారని.. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి 25 ఎకరాల్లో ఫామ్ హౌస్ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. ఇదే సమయంలో కేటీఆర్ ఫార్మ్‌హౌస్‌ను కొంత మంది డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు.