బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా సునీల్‌ జోషి… వెంకటేశ్ ప్రసాద్‌కు నిరాశ…

0
51
BCCI President Sunil Joshi, Sunil Joshi, MSK Prasad, BCCI, selection committee, Sunil Joshi to replace MSK Prasadsenior men’s selection committee Chairman Sunil Joshi, సునీల్ జోషీ, ఎమ్మెస్కే ప్రసాద్, బీసీసీఐ, సెలెక్షన్ కమిటీ, బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌‌గా సునీల్ జోషీ

బీసీసీఐ నూతన సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా భారత మాజీ క్రికెటర్‌ సునీల్‌ జోషీ నియమితులయ్యారు. నేషనల్‌ సెలక్షన్‌ ప్యానల్‌ ఛైర్మన్‌ను క్రికెట్‌ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) బుధవారం ఎంపిక చేసింది. మదన్‌ లాల్‌, ఆర్పీ సింగ్‌, సులక్షణా నాయక్‌లతో కూడిన సీఏసీ కొత్తగా ఇద్దరు సెలక్టర్లను ఎంపిక చేసింది. ఎమ్మెస్కే ప్రసాద్‌(సౌత్‌జోన్‌) స్థానంలో జోషీ ఛైర్మన్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సెలక్షన్‌ కమిటీ సభ్యుడిగా మరో మాజీ పేసర్‌ హర్విందర్‌ సింగ్‌కు సీఏసీ అవకాశం కల్పించింది.

సునీల్‌ జోషీని పురుషుల క్రికెట్‌ టీమ్‌ సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ప్రతిపాదిస్తూ సీఏసీ బీసీసీఐకి సిఫారసు చేసిందని బోర్డు కార్యదర్శి జై షా తెలిపారు. స్వదేశంలో సౌతాఫ్రికాతో సిరీస్‌కు నూతన ఛైర్మన్‌ ఆధ్వర్యంలోని సెలక్షన్‌ కమిటీ భారత జట్టును ఎంపిక చేయనుంది. ఖాళీగా ఉన్న రెండు సెలక్టర్‌ పోస్టుల కోసం బీసీసీఐకి 40 దరఖాస్తులు రాగా..అందులో ఐదుగురు జోషీ, హర్విందర్‌, వెంకటేశ్‌ ప్రసాద్‌, రాజేశ్‌ చౌహాన్‌, ఎల్‌ఎస్‌ శివరామకృష్ణన్‌లను షార్ట్‌లిస్ట్‌ చేసి తుది ఇంటర్వ్యూలు నిర్వహించింది.

వెంకటేశ్‌ నుంచి తీవ్ర పోటీ ఏర్పడినప్పటికీ జోషీ వైపే సీఏసీ మొగ్గు చూపడంతో అతడికే చీఫ్‌ సెలక్టర్‌ పదవి వరించింది. సునీల్ జోషీ భారత్ తరపున 1996- 2001 మధ్యకాలంలో 15 టెస్టులు, 69 వన్డేలు ఆడారు. గత సెలక్షన్ కమిటీలో ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాల పదవీకాలం ఇప్పటికే ముగియగా.. జతిన్ పరంజపే, సారాదీప్ సింగ్, దేవాంగ్ గాంధీల పదవీ కాలం మరికొద్దినెలల్లో ముగియనుంది. కాగా చీఫ్ సెలక్టర్ ఎంపిక నేపథ్యంలో సీఏసీ మంగళవారం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బోర్డు కార్యదర్శి జై షాలను కలిసి పలు సూచనలు తీసుకుంది.