సీఎం జగన్ నిర్ణయంతో….బీజేపీ ఇరకాటంలో పడే అవకాశం….

0
60

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఏపీ శాసన మండలి సెలక్ట్ కమిటీకి పంపడంతో నొచ్చుకున్న సీఎం జగన్ మండలిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిపై సోమవారం చర్చిద్దామని కూడా అన్నారు. మండలిని రద్దు చేయాలంటే ముందుగా శాసన సభలో తీర్మానం చేయాలి. అనంతరం దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. పార్లమెంటు ఉభయ సభల్లో అది ఆమోదం పొందాలి. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్ర వేశాక, గెజిట్ విడుదల చేస్తేనే మండలి రద్దు అవుతుంది. అయితే.. ఇక్కడ జగన్ తీసుకునే నిర్ణయం వల్ల బీజేపీ ఇరకాటంలో పడే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదెలా అంటే.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఏపీలో పాగా వేయాలని ప్రయత్నిస్తున్న అదే పార్టీ.. బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందేలా చేయాలని చెబుతున్నారు.

అయితే.. ఏపీలో రాజధాని పరిపాలన వికేంద్రీకరణకు బీజేపీ ఒప్పుకోవడం లేదు. జాతీయ స్థాయి నేతలు ముట్టనట్లు వ్యవహరిస్తున్నా.. రాష్ట్ర నేతలు మాత్రం జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వికేంద్రీకరణకు ఎట్టి పరిస్థితుల్లోను ఒప్పుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. బీజేపీ మిత్ర పక్షం జనసేన కూడా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. మండలి రద్దు నిర్ణయానికి అసలు కారణమే.. వికేంద్రీకరణ బిల్లు. అలాంటిది వికేంద్రీకరణను వ్యతిరేకించే బీజేపీ.. మండలి రద్దుకు పార్లమెంటులో ఆమోదం తెలిపితే కాషాయ పార్టీ ఇరుకున పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.