రిషబ్ పంత్ సహజసిద్ధ కీపర్ కాదు: భారత ప్రధాన కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు

0
57

భారత తుదిజట్టులో చోటు కోల్పోయిన రిషబ్ పంత్‌పై భారత ప్రధాన కోచ్ రవి శాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతని వికెట్ కీపింగ్ నైపుణ్యాల గురించి మాట్లాడాడు. గతవారంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ మధ్యలో వికెట్ కీపర్ ప్లేస్‌కు దూరమైన పంత్.. రీ ఎంట్రీ కోసం పరితపిస్తున్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో అతను రిజర్వ్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే.
అయితే రిషబ్ పంత్ జట్టులోకి పునరాగమనం చేయాలంటే తన వికెట్ కీపింగ్ నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరముందని రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు. తను సహజసిద్ధమైన కీపర్ కాదని గుర్తు చేసిన శాస్త్రి.. అతనిలో పుష్కలమైన టాలెంట్ ఉందని పేర్కొన్నాడు. అయితే వికెట్ కీపింగ్ నైపుణ్యాలు మెరుగుపర్చుకోలేకపోతే అతని టాలెంట్ వేస్ట్ అవుతుందని వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం ఈ విషయాన్ని గుర్తించిన పంత్.. చాలా కష్టపడుతున్నాడని రవి తెలిపాడు. తన బ్యాటింగ్‌తోపాటు వికెట్ కీపింగ్ నైపుణ్యాలను పెంచుకుంటున్నాడని అభిప్రాయపడ్డాడు. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వారసునిగా జట్టులోకి వచ్చిన పంత్.. అన్ని రంగాల్లోనూ విఫలమయ్యాడు. అయితే ఇటీవల వెస్టిండీస్ సిరీస్‌లో కాస్త ఆకట్టుకున్నా.. ఆసీస్ సిరీస్‌లో గాయపడటం తన స్థానానికే ఎసరు తెచ్చింది. ఆ సిరీస్ రెండో వన్డేలో పంత్ గాయపడటంతో.. పంత్ స్థానంలో కీపర్‌గా సత్తాచాటిన లోకేశ్ రాహుల్ జట్టులో పాతకుపోయాడు. దీంతో పూర్తి ఫిట్‌గా మారిన పంత్ రిజర్వ్‌కే పరిమితమవుతున్నాడు.