మా దేశంలో భారత్ ఆడకుంటే ప్రపంచకప్‌ను బహిష్కరిస్తాం

0
41

తమ దేశంలో భారత్ ఆడాలని, లేకుంటే తీవ్ర నిర్ణయం తీసుకుంటామని తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది ఆసియాకప్‌ను పాక్‌లో నిర్వహించడానికి ఏసీసీ అనుమతించిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది ఆసియాకప్‌ను నిర్వహించేందుకు పాకిస్థాన్‌కు ఆతిథ్యహక్కులు దక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నీలో ఆడేందుకు భారత్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడం సందేహాస్పదమే. గతకొంతకాలంగా పాక్‌తో భారత్ ద్వైపాక్షిక సంబంధాలను నిలుపుదల చేసిన క్రమంలో, పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను బహిష్కరించడంతోపాటు ఆ దేశంలో ఇండియా పర్యటించడం లేదు. ఈక్రమంలో ఈ ఏడాది తమదేశంలో జరిగే ఆసియాకప్‌లో ఆడకుంటే తీవ్ర నిర్ణయం తీసుకుంటామని తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది.

ఆస్ట్రేలియాలో టీ20లో వరల్డ్‌కప్‌ ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగనుంది. దానికి సన్నాహకంగా ఆసియాకప్‌ను పాక్‌లో నిర్వహిస్తున్నారు. అయితే ఈ టోర్నీలో భారత్ ఆడకుంటే, వచ్చే ఏడాది ఇండియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సీఈఓ వసీమ్ ఖాన్ తేల్చిచెప్పారు. మరోవైపు ఆసియాకప్‌ను పాక్ నుంచి తరలిస్తారనే వార్తలు కేవలం పుకార్లని, వాటిని నమ్మాకూడదని తెలిపారు.

ప్రస్తుతం పాకిస్థాన్‌లో బంగ్లాదేశ్ పర్యటిస్తోంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా లాహోర్‌లోని గఢాఫీ స్టేడియంలో శుక్రవారం తొలి మ్యాచ్ జరుగగా.. శనివారం రెండో మ్యాచ్‌ను ఆడుతోంది. అయితే అనేక అనుమానాలు, చర్చల మధ్య ఈ సిరీస్‌కు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) పచ్చజెండా ఊపింది. ఆసియాకప్‌ హక్కులను ఇస్తామని పీసీబీ ఆఫర్ ఇవ్వడంతోనే బంగ్లాదేశ్.. పాక్‌లో సిరీస్ ఆడుతుందని ప్రచారం జరుగుతోంది. దీన్ని వసీమ్ కొట్టి పారేశారు. టోర్నీ ఆతిథ్య హక్కుల్ని నిర్ణయించేది తామో లేదా ఐసీసీనో కాదని, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కు ఆ ఆధికారం ఉందని గుర్తు చేశారు. ఈక్రమంలో ఆసియాకప్‌ను బంగ్లాకు తరలిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొన్నారు.