తమిళ స్టార్ హీరో రజినీకాంత్‌పై ద్రవిడ సంస్థ పిటిషన్‌‌ను తోసిపుచ్చిన హైకోర్టు

0
33

ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళ స్టార్ హీరో రజినీకాంత్‌పై చర్యలకు చెన్నై పోలీసులను ఆదేశించాలంటూ ‘ద్రవిడార్ విడుదలై కళగం’ (డీవీకే) వేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చింది. మేజిస్ట్రేట్‌ కోర్టుకు వెళ్లకుండా హైకోర్టుకు రావాల్సిన తొందరేమి వచ్చింది? అని కోర్టు ప్రశ్నించింది.

ఇటీవల చెన్నైలో జరిగిన తమిళ పత్రిక ‘తుగ్లక్’ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో రజినీకాంత్ పాల్గొన్నారు. పెరియార్ ఆధ్వర్యంలో 1971లో సేలంలో నిర్వహించిన ర్యాలీలో దుస్తులులేని సీతారాముల విగ్రహాలకు పాదరక్షల దండ వేశారని రజినీకాంత్ తన ప్రసంగంలో వ్యాఖ్యానించారు. ఈ ర్యాలీని అప్పట్లో ఛో రామస్వామి కూడా విమర్శించినట్టు చెప్పారు.

రజినీ వ్యాఖ్యలను డీఎంకే తప్పుపట్టగా, డీవీకే జనవరి 18న ట్రిప్లికేన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే, ఎఫ్ఐఆర్‌ నమోదుకు కానీ, ఫిర్యాదు చేసినట్టు రిసిప్ట్ ఇచ్చేందుకు కానీ పోలీసు అధికారులు నిరాకరించినట్టు ఆ సంస్థ చెన్నై జిల్లా కార్యదర్శి ఉమాపతి తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టును డీవీకే ఆశ్రయించింది. మతం పేరుతో తమిళనాడు ప్రజల మధ్య శత్రుత్వాన్ని పెంచేందుకు, అశాంతిని రెచ్చగొట్టేందుకు రజినీ ప్రయత్నించారంటూ పిటిషన్‌లో ఆరోపించింది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుకు పోలీసులను ఆదేశించాలని కోర్టును కోరింది.