ఉసురు తీసిన అనుమానం

0
43

భార్యపై అనుమానంతో మద్యం మత్తులో భర్త ఆమెను కిరాతకంగా హతమార్చిన ఘటన శనివారం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని ఇగుడూరులో చోటుచేసుకుంది. గ్రామీణ సీఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. ఇగుడూరుకు చెందిన సత్యనారాయణ, సాలెమ్మ(50) దంపతులు. వీరికి ముగ్గరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూనే కుమార్తెలకు వివాహం చేశారు. గత మూడు నెలలుగా సత్యనారాయణ భార్య సాలెమ్మ వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే అనుమానంతో ఆమెను నిత్యం వేధిస్తూ ఉండేవాడు. ఈ విషయమై 15 రోజుల కిందట కూడా భార్యాభర్తలు గొడవపడ్డారు. బంధువులు కలగజేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ శనివారం రాత్రి మద్యం మత్తులో భార్యతో వాగ్వాదానికి దిగాడు. సాలెమ్మ నిద్రిస్తున్న సమయంలో అతడు రోకలి బండతో తలపై మోది హత్య చేశాడు. ఈవిషయం తెలుసుకున్న గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన రోకలి బండను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.