ఇంగ్లిష్‌ మీడియం నిర్బంధమే…విద్యార్థికి ఆప్షన్‌ అవకాశం లేదు….

0
60

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఏ మీడియంలో చదువుకోవాలో నిర్ణయం తీసుకునే అవకాశం విద్యార్థికి లేదని, నిర్బంధ ఇంగ్లిష్‌ మీడియం కొనసాగుతుందని అసెంబ్లీ తేల్చింది. గత సమావేశాల్లో ఈ బిల్లుకు శాసనమండలి సవరణలు సూచిస్తూ తిప్పి అసెంబ్లీకి పంపింది. ఏ మీడియంలో చదువుకోవాలో విద్యార్థే నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించేలా చట్టాన్ని సవరించాలని మండలి సూచించింది. ఈ నేపథ్యంలో గురువారం అసెంబ్లీలో విద్యా చట్టం సవరణ బిల్లుపై చర్చ జరిగింది. దీనిపై మాట్లాడిన వైసీపీ సభ్యులు.. మండలి ప్రతిపాదించిన సవరణలు ఏమీ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తీర్మానం చేసి మళ్లీ మండలికి పంపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ పేదవిద్యార్థుల కోసం ‘రైట్‌ టు ఇంగ్లిష్‌ ఎడ్యుకేషన్‌’ విధానం తీసుకొచ్చామన్నారు.

మండలి ప్రతిపాదించిన సవరణలను తిరస్కరిస్తూ ఇప్పుడు మళ్లీ మండలికి బిల్లు పంపుతామని, ఈ సారి మండలి బిల్లును అడ్డుకున్నా చట్టంగా మారుతుందని స్పష్టంచేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం తీసుకురావాలని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలతో పాటు, అగ్రవర్ణాల్లోని పేదలు కూడా ఆకాంక్షిస్తున్నారని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో వేల రూపాయల ఫీజులు కట్టలేకపోతున్నారని, ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం వస్తే తమ బతుకులు మారుతాయని దశాబ్దాల తరబడి వేచి చూస్తున్నారని సీఎం తెలిపారు. ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల్లో 23.67 శాతమే ఇంగ్లిష్‌ మీడియంలో బోధిస్తున్నాయని, మొత్తం ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ఉన్నవి 35శాతం దాటలేదన్నారు. అదే ప్రైవేటు స్కూళ్లలో 98.5 శాతం పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదపిల్లల బతుకులు మార్చడానికే ఇంగ్లిష్‌ మీడియం తీసుకురావాలని నిర్ణయించినట్లు జగన్‌ చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ స్కూళ్లు తిరిగి తెరవడానికి ముందే జూన్‌ 1న విద్యాకానుక కింద ప్రత్యేక కిట్లు అందజేస్తామని ఆయన ప్రకటించారు.